- వార్షిక ప్రణాళిక లేకపోవడంతో రూ.15.47 కోట్లే రిలీజ్
- ‘టైగర్ ప్రాజెక్టు, ఎలిఫెంట్ సబ్ స్కీం’ కింద మరో రూ.14.34 కోట్లు శాంక్షన్
- అధికారుల నిర్లక్ష్యంతో చాలినన్ని నిధులు రాలేదని విమర్శలు
హైదరాబాద్, వెలుగు: అటవీ, వన్యప్రాణి సంరక్షణ కోసం కేంద్రం నిధులు కేటాయిస్తున్నా.. రాష్ట్ర అటవీ అధికారుల నిర్లక్ష్యం, ప్రణాళిక లోపంతో వాటిని వినియోగించుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఇంటిగ్రేటెడ్ డెవలప్‌మెంట్ ఆఫ్ వైల్డ్ లైఫ్ హాబిటాట్స్(ఐడీడబ్ల్యూహెచ్) స్కీమ్ కింద వన్యప్రాణి ఆవాసాల సంరక్షణ, అభివృద్ధికి ఏటా కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తోంది. గత ఐదేండ్లలో ఈ స్కీమ్ కింద రూ.47.38 కోట్లు కేటాయించినా.. రాష్ట్రానికి వచ్చింది రూ.15.47 కోట్లు మాత్రమే. సుమారు రూ.31.91 కోట్ల నిధులు అందకుండా పోయాయి.
అధికారుల వార్షిక కార్యాచరణ ప్రణాళికల్లో (ఏపీఏ) లోపం, పర్యవేక్షణలో నిర్లక్ష్యం కారణంగా ఈ నిధులు పూర్తి స్థాయిలో రాష్ట్రానికి అందలేదనే విమర్శలు వస్తున్నాయి. అలాగే, వన్యప్రాణుల ఆవాసాల అభివృద్ధి, టైగర్ ప్రాజెక్ట్, ఎలిఫెంట్ సబ్ స్కీమ్ కింద కూడా కేంద్రం నిధులు విడుదల చేస్తుంది. ఆవాసాల పరిరక్షణ, వేటగాళ్లను అడ్డుకునే చర్యలు, పర్యావరణ అభివృద్ధి కోసం ఈ నిధులు వాడతారు. కవ్వాల్, అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లలో వన్యప్రాణి సంరక్షణ, అటవీ అభివృద్ధికి కీలకమైన టైగర్ ప్రాజెక్ట్, ఎలిఫెంట్ సబ్ -స్కీమ్ కింద కేంద్రం రూ.14.34 కోట్లు కేటాయించింది.
అందులోనూ రూ.3.52 కోట్లు మాత్రమే విడుదల చేసింది. 2020–-21లో రూ.1.13 కోట్ల కేటాయించగా.. రూ.37 లక్షలు, 2021–-22లో రూ.9.87 కోట్లకు రూ.5.43 కోట్లు, 2023–-24లో రూ.11.82 కోట్లకు రూ.3.23 కోట్లు, 2024–-25లో రూ.10.21 కోట్లకు రూ.2.92 కోట్లు మాత్రమే విడుదల చేసింది. 2022–-23లో నిధులు కేటాయించలేదు.
టైగర్ రిజర్వ్‌లపై తీవ్ర ప్రభావం
నిధుల కొరతతో కవ్వాల్, అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లలో పెట్రోలింగ్, ఆవాసాల మెరుగుదల, కమ్యూనిటీ ఔట్ రీచ్ కార్యక్రమాలపై తీవ్ర ప్రభావం పడుతోంది. వేట నిరోధక చర్యలు, అటవీ ఆక్రమణల నివారణ, పర్యావరణ పర్యాటక అభివృద్ధికి ఆటంకాలు ఏర్పడుతున్నాయి. అంతేకాకుండా అటవీ క్షీణత, వన్యప్రాణుల ఆవాసాలు దెబ్బతినడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అటవీ శాఖ అధికారులు సకాలంలో ప్రణాళికలు సమర్పించి సమన్వయంతో పనిచేస్తే కేంద్రం నిధులను పూర్తి స్థాయిలో పొందే అవకాశం ఉండేదన్నారు. నిధుల కొరతను అధిగమించి అడవులు, వన్యప్రాణుల సంరక్షణ, పచ్చదనాన్ని కాపాడాలని పర్యావరణవేత్తలు కోరుతున్నారు.
తగ్గుతున్న అటవీ విస్తీర్ణం..
అటవీ శాఖలో అధికారుల మధ్య సమన్వయ లోపం, వార్షిక ప్రణాళిక రూపకల్పనలో విఫలం అవుతుండడంతో రాష్ట్రానికి కేంద్రం నిధుల్లో కోత విధిస్తున్నట్లు తెలిసింది. అయితే.. కేంద్రం కోతలు పెట్టడం లేదని, విడతల వారీగా విడుదల చేస్తుందని అధికారులు చెబుతున్నారు. మరోవైపు ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, ఆసిఫాబాద్, కొత్తగూడెం, భూపాలపల్లి, ములుగు, వరంగల్, అమ్రాబాద్ తోపాటు పలు అటవీ ప్రాంతాల్లో మనుషులు, పశువులపై అటవీ జంతవులు దాడులు పెరుగుతున్నాయి.
స్థానికులు, క్రూరమృగాల మధ్య సంఘర్షణలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. వీటిని అదుపు చేయాల్సిన ఫారెస్ట్ ఆఫీసర్లు నిధుల లేమి సాకుతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి. అంతేకాకుండా యథేచ్ఛగా కలప స్మగ్లింగ్, భూకబ్జాలు, మైనింగ్ పనులు జరుగుతున్నా.. మాముళ్లు తీసుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. ఫలితంగా రాష్ట్రంలో 2021–23 మధ్య కాలంలో 100.42 చదరపు కిలోమీటర్ల (చ.కి.మీ) అటవీ విస్తీర్ణం తగ్గింది.
